ఖరీఫ్ సీజన్ ను దృష్టిలో పెట్టుకుని ఎరువుల సరఫరాకు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యమని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీజన్ ఆరంభంలో విత్తనాల సమస్యతో ఇబ్బందిపడ్డ రైతులకు.. ఇప్పుడు యూరియా కొరత మరో తలనొప్పిగా తయారైంది. ఖమ్మం జిల్లాలో అన్నదాతల పంట కష్టాల పై రైతే రాజు ప్రత్యేక కథనం..
ఎగువన వర్షాలు కురవడంతో నాగార్జున సాగర్ కు జలకళతో ఉట్టిపడుతోంది. దీంతో సాగర్ ఎడమ కాల్వ నీటితో ఖమ్మం జిల్లాలో ఖరీఫ్ సాగు జోరందుకుంది. జిల్లా వ్యాప్తంగా 4 లక్షల హెక్టార్లకు గాను.. 3లక్షల హెక్టార్లకు పైగా రైతులు పంట సాగు చేస్తున్నారు. వరదలు వచ్చిన గోదావరి ప్రాంతం మినహా.. అన్ని చోట్ల వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఒకటిన్నర లక్షల హెక్టార్ల వరిసాగులో 50 వేల హెక్టార్లకు పైగా వరినాట్లు పడ్డాయి. ఒక లక్ష 60వేల హెక్టార్లలో పత్తి సాగు చేస్తున్నారు. మొక్కజొన్న ఇతర పంటలు లక్ష హెక్టార్లలో సాగవుతోంది.
అయితే ప్రస్తుతం వరి పంటలకు ఎరువుల కొరత వేధిస్తోంది. ఓ వైపు ఆలస్యంగా సాగవుతున్న పంటలకు తోడు.. సీమాంధ్రలో కూడా ఖరీఫ్ సీజన్ ఏక కాలంలో మెదలవడంతో ఎరువులు అందడం లేదు. ఇప్పటి వరకు 70 వేల మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు రావాల్సి ఉండగా.. సగం మాత్రమే జిల్లాకు చేరింది. మరో 30 వేల మెట్రిక్ టన్నుల యూరియా కొరత ఉంది. దీంతో గత ఏడాది నిల్వ ఉన్న నాలుగు వేల మెట్రిక్ టన్నులను ప్రస్తుతం వినియోగిస్తున్నారు. సాగర్ ఆయకట్టు పరిధిలోని 16మండలాల్లో వరి, పత్తి పంటలు సాగైతే.. యూరియా, డిఏపీ డిమాండ్ భారీగా పెరగనుంది. ప్రభుత్వం సొసైటీల ద్వారా ఎరువులను అందజేయాలని రైతులు కోరుతున్నారు.
గోదావరి పరివాహక ప్రాంతంలో 30 వేల హెక్టార్లలో పంటలు దెబ్బతినగా.. వాటన్నింటిని సాగు చేసేందుకు రైతులు సిద్దమవుతున్నారు. అయితే గోదావరి పరివాహక ప్రాంతాల్లో వ్యవసాయం ప్రారంభమైతే తిరిగి యూరియా కొరత ఒక్కసారిగా పెరిగే ప్రమాదం ఉంది. ఇదిలా ఉంటే సీజన్ ప్రారంభంలో పత్తి విత్తనాల కోసం రైతులు తీవ్ర సమస్యలను ఎదుర్కొన్నారు. సరిపడా విత్తనాలు రాకపోవటంతో బ్లాక్ లో విత్తనాలను కొనుగోలు చేయాల్సిన దుస్థితి వచ్చింది. గత ఏడాది యూరియా కొరత జిల్లాను వేధించడంతో.. రైతులు గోడౌన్లపై దాడులు చేశారు. ఈ నేపథ్యంలో ఎరువుల కొరతపై రైతుల్లో మరోసారి ఆందోళన నెలకొంది.
సగానికి పైగా యూరియా జిల్లాకు రావాల్సి ఉంది. ప్రతి ఏడాది రైతుకు ఏదో ఒక కష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి. విత్తనాల కొరత, దీనికి తోడు నకిలీ విత్తనాల బెడద, ఆపై ఎరువుల కొరత.. ఇలా అన్నదాతకు అన్నీ ఇబ్బందులే. అధికారులు ప్రణాణాళికా బద్దంగా వ్యవహరించక పోవటం సమస్యకు కారణమవుతోంది. జిల్లా వ్యవసాయ శాఖ నిర్లక్ష్య ధోరణిపై రైతులు, రైతు సంఘాలు మండిపడుతున్నాయి.
మరోవైపు రాష్ట్రంలో రైతు పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. రైతులు సమస్యను ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. వెంటనే వ్యవసాయ శాఖ స్పందించి ఎరువులను తెప్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.